23, సెప్టెంబర్ 2020, బుధవారం

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు. 

 
అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో విడదీయలేనంతగా పెనవేసుకున్న ఓ మధురమైన అనుభూతి వీధరుగు. కాలుష్యం గురించీ, బద్రత గురించీ బెంగలేని ఒకప్పటి రోజుల్లో ఇంట్లో కన్నా ఈ వీధి అరుగు మీదే ఎక్కువ సమయం గడిపేవారు. 

పొద్దున్నే చిన్న పిల్లల ఆటస్థలంగా మారితే కాస్త పొద్దుపోయాక వీధి వీధి తిరిగి కూరలు, పళ్ళు, తినుబండారాలు, చీరలు ఇతరత్రా అమ్మే వర్తకుల వ్యాపార కేంద్రంగా మారిపోతుంది. మధ్యాహ్నం పూట పడుచుపిల్లల బోర్డ్ గేమ్స్ కు వేదిక గా, సాయంకాలం పెద్దమనుషుల పిచ్చాపాటీ వేదికగా ఒక్కో సమయంలో ఒక్కో రూపంలోకి మారిపోతూ రకరకాల అవసరాలను తీరుస్తుంటుంది ఈ వీధరుగు.

ఇప్పుడంటే జూమ్ కాల్సూ, గూగుల్ మీట్ లూ ఉండి కాలు కదపకుండా ఇంట్లోంచే ప్రపంచంతో మీటింగులు పెట్టేసి మాట్లాడేస్తున్నాం కానీ ఒకప్పుడు మీటింగ్ ప్లేసులంటే ఈ వీధరుగులే. ఊరంతటికీ మీటింగ్ ప్లేస్ రచ్చబండైతే మన వీధికి మీటింగ్ ప్లేస్ మనింటి అరుగే.  
 

ఈ అరుగులమీద మాట్లాడుకోని విషయం లేదు ఒకటా రెండా ఇంటి విషయాలు పొలం పనుల నుండి మొదలు పెట్టి, ఊరు దాటి దేశం దాటి ప్రపంచం యుద్దాల వరకూ అన్ని విషయాలు ఈ అరుగులమీదే మాట్లాడుకునే వాళ్ళు అప్పట్లో మన పెద్దవాళ్ళు. 

సో అచ్చంగా అలాగే నా వీధరుగు నా ముచ్చట్లకు వేదిక. ఇందులో నా జ్ఞాపకాలు, సరదా కబుర్లు, సినిమా రివ్యూలు, టీవీ షో రివ్యూలు, పుస్తకాల రివ్యూలు ఇలా అవీ ఇవీ అనే తేడాల్లేకుండా నాకు తోచిన నాకు నచ్చిన విషయాల గురించి మీతో పంచుకుంటాను. 

కరెంట్ ట్రెండ్ యూట్యూబ్ ఛానల్స్ కదా అందుకే ఇదే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ కూడా మొదలు పెడుతున్నాను. అందులో నా స్వరంతో ఈ కబుర్లు రికార్డ్ చేసి వినిపించాలని అనుకుంటున్నాను. నా ఛానల్ ఇక్కడ చూడవచ్చు. మీరు ఆదరిస్తారని ఆశిస్తూ త్వరలో ఓ మంచి పోస్ట్ తో మళ్ళీ కలుద్దాం. 


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కామెంట్స్ చేసేప్పుడు మన ఇంట్లో లివింగ్ రూమ్లో ఫ్యామిలీతో మాట్లాడే భాషను మాత్రమే ఉపయోగించండి. దయచేసి చాయ్ బడ్డీల దగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడే భాష వాడకండి.

కబుర్లు చెప్తున్నది..

ఈ బ్లాగ్ గురించి..

వీధి అరుగు...

ఈ పోస్ట్ నా స్వరంలో ఇక్కడ వినవచ్చు.    అపార్ట్మెంట్ కల్చర్ తో కనుమరుగైపోయాయి కానీ పల్లె జీవనంతో పరిచయమున్న ప్రతి ఒక్క తెలుగు వారి జీవితంతో...

మొత్తం పేజీ వీక్షణలు

Popular Posts